News

Adhirindhi the start

ఆరంభం.. అదిరింది

ఆరంభం.. అదిరింది
అట్టహాసంగా ‘ఈనాడు ఛాంపియన్‌ క్రికెట్‌ కప్‌-2016’.. రాయలసీమ రాకర్స్‌ కప్‌ పోటీలు ప్రారంభం
ఫ్లడ్‌లైట్ల వెలుతురు మధ్య పోటీలు
జూనియర్స్‌లో తుదిపోరుకు అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌ జట్టు

తిరుపతి(క్రీడలు), న్యూస్‌టుడే: గ్రామీణ యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ‘ఈనాడు’ యాజమాన్యం దశాబ్ద కాలానికిపైగా ‘ఈనాడు ఛాంపియన్‌షిప్‌’ నిర్వహించడం అభినందనీయమని భారతీయ విద్యాభవన్స్‌ తిరుపతి కేంద్రం గౌరవాధ్యక్షులు, జిల్లా బాల బాలికల క్రికెట్‌ సంఘం ఛైర్మన్‌ స¾త్యనారాయణరాజు పేర్కొన్నారు. తిరుపతి తుమ్మలగుంట వైఎస్‌ఆర్‌ క్రీడామైదానాల్లో మంగళవారం ఈనాడు, ఈతరం క్లబ్‌ ఈనాడు ఛాంపియన్‌ (ఈసీసీ) కప్‌-2016, రాయలసీమ రాకర్స్‌ కప్‌ జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో సెమిస్‌ పోరు టీ20 మ్యాచ్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం రాత్రి జరిగింది.

కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాణ్యమైన వార్తలకే పరిమితం కాకుండా ప్ర¾కృతి వైపరీత్యాలు జరిగిన సందర్భంలోనూ తక్షణం స్పందించడం, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం, యువతలో క్రమశిక్షణతో కూడిన పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు ‘ఈనాడు’ కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ యువత పెడదోవ పట్టకుండా క్రికెట్‌ సాధనవైపు దృష్టిసారించాలని పిలుపునిచ్చారు.

గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం
గ్రామీణ క్రీడలు కబడ్డీ, ఖోఖో, చదరంగం, వాలీవాల్‌ పోటీలు మరుగున పడిపోతున్న తరుణంలో ‘ఈనాడు’ యాజమాన్యం స్వతహాగా జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రోత్సహించిందని తిరుపతి ‘ఈనాడు’ మేనేజరు టి.శ్రీనివాసులు పేర్కొన్నారు. గ్రామీణ క్రీడాకారులను క్రేజీ ఉన్న క్రీడ ద్వారా ఆకర్షించి.. వారికి ఉజ్వల భవిషత్తును అందించవచ్చనే సంకల్పంతో ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు 2003 నుంచి క్రికెట్‌ ఛాంపియన్‌ ప్రవేశపెట్టి ఏటా విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చదువుతోపాటు, క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.

మైదానంలో ఉచిత వైఫై సేవలు
ఈనాడు ఛాంపియన్‌ క్రికెట్‌ కప్‌ సెమిస్‌, తుది పోరు మ్యాచ్‌లను ఫ్లడ్‌ లైట్ల కాంతుల్లో చూడడానికి విచ్చేసే క్రీడాభిమానులకు, ప్రజలకు ఉచిత వైఫై సేవలు అందించడానికి జియో ఏర్పాట్లు చేసిన్నట్లు సీనియర్‌ మేనేజరు జి.సూర్యనారాయణ ప్రకటించారు. మైదానంలో జియో సిమ్‌లను క్రీడాభిమానులకు ఉచితంగా అందిచనున్నట్లు చెప్పారు. అవకాశాన్ని క్రీడాకారులు, క్రీడాభిమానులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

అంతర్జాతీయ క్రీడా వాతావరణం
చెట్టు, పుట్టల మధ్య ఆడుకునే క్రీడాకారులకు అంతర్జాతీయ క్రీడా వాతావరణం అందించి పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని ఈనాడు యాజమాన్యం అందించడం అద్భుతమని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టరు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. కేవలం నగరాలకే పరిమితం అయిన ఫ్లడ్‌లైట్ల వెలుగుల మ్యాచ్‌లను తుమ్మలగుంట క్రీడామైదానాల్లోకి తీసుకువచ్చి అందించడం పట్ల ఈనాడు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. సీమస్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పౌరసన్మానం చేస్తానని చెవిరెడ్డి ప్రకటించారు.

స్వచ్ఛభారత్‌ కార్యక్రమంపై ప్రమాణం..
ఈనాడు రాయలసీమ రాకర్స్‌ కప్‌ వీక్షకులు, క్రీడాకారులతో ఈనాడు తిరుపతి యూనిట్‌ మేనేజరు టి.శ్రీనివాసులు స్వచ్ఛభారత్‌ కార్యక్రమంపై మైదానంలో ప్రమాణం చేయించారు. అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన క్రీడా జట్లను అతిథులు పరిచయం చేసుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బ్యాటింగ్‌, సూర్యనారాయణ బౌలింగ్‌చేసి మ్యాచ్‌లు ప్రారంభించారు.