News

ఆలోచన మెరిసింది ఆవిష్కరణ అదిరింది!

ఆలోచన మెరిసింది ఆవిష్కరణ అదిరింది!
విద్యార్థుల చేతుల్లో వినూత్న ఆవిష్కరణలు
శాస్త్రీయ జిజ్ఞాసపై శాస్త్రవేత్తల అభినందన
చిల్డ్రన్‌ కాంగ్రెస్‌కు పోటెత్తిన పిల్లలు
ఈనాడు, తిరుపతి

మనమంతా రోజూ ఎదుర్కొనే సమస్యలే. ఓ రకంగా వాటికి అలవాటు పడ్డాం కూడా.. కాని రేపటి తరానికి ప్రాతినిధ్యం వహించే ఆ చిన్నారులు వాటికి పరిష్కారాలపై దృష్టి సారించారు. సృజనాత్మకంగా ఆలోచించారు. మదిలో మెదిలిన ఆలోచనలకు ఓ ఆకారాన్ని ఇచ్చారు. సరికొత్త ఆవిష్కరణలకు బీజం వేశారు. అవసరాలే ఆవిష్కరణలకు హేతువు అన్న నానుడిని అక్షరాలా నిరూపించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం వేదికగా నిర్వహిస్తున్న వైజ్ఞానిక ప్రదర్శన, బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో ఎన్నో అద్భుత ఆవిష్కరణలు కొలువుదీరాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన బాల మేధావులు తమ ప్రయోగ నమూనాలతో ఆకట్టుకుంటున్నారు.

కూత వింటే.. గేటు పడుద్ది!
విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం నడుకూరుకు చెందిన పదో తరగతి విద్యార్థి జి.లోకేశ్‌ మూడు ప్రయోగాలతో మెరిశాడు. రైల్వే గేట్ల వద్ద ప్రమాదాలను నివారించేందుకు ఆటోమేటిక్‌ రైల్వే గేట్‌ విధానాన్ని రూపొందించారు. రైలు ఓ స్టేషన్‌ నుంచి బయల్దేరగానే దాని ముందున్న గేటు తెరిచి ఉందా? మూసి ఉందా? అన్న సందేశం రైలు డ్రైవర్‌కు అందుతుంది. రైల్వే గేటు వద్ద అమర్చిన సెన్సార్‌.. ఈ మేరకు తదుపరి రైలుకు ఎర్ర/పచ్చ బల్బు రూపంలో సంకేతాలిస్తుంది.

ఈ సిగ్నల్స్‌ ఆధారంగా రైలు డ్రైవర్‌ అప్రమత్తమయ్యే ఆస్కారముంది. సమీపంలోకి వచ్చే వరకూ ఎర్రబల్బు అలాగే వెలుగుతూ ఉంటే గేట్‌మెన్‌ను అప్రమత్తం చేయడంతో పాటు అలార్మ్‌ శబ్దంతో దానంతటదే గేటు పడిపోతుంది. ఒకటిన్నర అడుగుల వ్యాసార్ధంతో రూపొందించిన నమూనా రైలుపై ప్రధాని నరేంద్రమోదీ ఆశయాలైన మేక్‌ ఇన్‌ ఇండియా, స్వచ్ఛభారత్‌ నినాదాలతో రూపొందించాడు. అలాగే, మిస్డ్‌ కాల్‌ ద్వారా పొలం వద్ద బోరుపంపును ఆపరేట్‌ చేయడం, పెంపుడు జంతువులను అప్రమత్తం చేయడంపై ప్రయోగాలు రూపొందించాడు.

సుజలం.. ప్రయోగం సఫలం
నీటి కాలుష్యాన్ని నివారించే సరికొత్త మార్గాలను అన్వేషించాడు రాజస్థాన్‌కు చెందిన పదేళ్ల చిన్నారి అవీ మెహ్‌తా(10). మహారాణా మేవార్‌ విద్యామందిర్‌లో అయిదో తరగతి చదువుతున్న ఈ బాలుడు నీటి కాలుష్య కారకాలు బోరుబావిలోనే వడపోసే పద్ధతులను కనిపెట్టాడు. కాలుష్య నీటిని తాగడం వల్ల వచ్చే వ్యాధులు, నివారణ పద్ధతులను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తున్నాడు.

వ్యసనం.. పర్యవసానం
ప్రకృతి ప్రసాదిత గాలిని పీల్చడం ద్వారానే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని, కాలుష్య కారకాల వల్ల కలిగే దుష్ఫలితాలు అపారమని వివరిస్తోంది నెల్లూరుకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎల్‌.మన్విత. మద్యం, ధూమపానం ఫలితంగా జరుగుతున్న మరణాలపై లెక్కలు తీసుకువచ్చింది. ఈ వ్యసనాలను ఎలా మానుకోవాలో శాస్త్రీయంగా వివరించింది. గిన్సెంగ్‌ అనే మొక్క వేర్ల నుంచి తీసిన పొడిలోని ఆయుర్వేద గుణాలు వ్యసనపరులకు చికిత్సగా ఆమె నిరూపించింది. ఇందుకు భారత ఆయుర్వేద విభాగం అందించిన ధ్రువపత్రాన్ని ప్రదర్శించింది.