News

ఆవిష్కరణలకు ఎస్వీయూ కేంద్ర బిందువు

ఆవిష్కరణలకు ఎస్వీయూ కేంద్ర బిందువు

పాలనాధికారి ప్రద్యుమ్న

తిరుపతి(ఎస్వీ విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: ‘శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన దిశానిర్దేశంలో వర్సిటీ యంత్రాంగం  చరుగ్గా పనిచేస్తోంది’ అని జిలా పాలనాధికారి ప్రద్యుమ్న కితాబిచ్చారు. సోమవారం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి విచ్చేసిన ఆయన వీసీ ఆచార్య దామోదరంతో కలిసి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన పలువురు విభాగాధిపతులు, ఇంజినీరింగ్‌ విభాగాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాలనాధికారి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్వీయూ భాగస్వామ్యం కూడా ఎంతైనా అవసరమని, నూతన ఆవిష్కరణలకు ఎస్వీయూ కేంద్ర బిందువుగా ఉందని కొనియాడారు. ఇక్కడివారి నైపుణ్యత ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడాలన్నారు. రోడ్లు, ప్రహరీలు, మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛభారత్‌ వంటి కార్యక్రమాలపై సమీక్షలో చర్చించారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ అధ్యాపకులను రాబోవు రోజులలో పైలెట్‌ ప్రాజెక్టు కింద భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. వీసీ ఆచార్య దామోదరం మాట్లాడుతూ విశ్వవిద్యాలయం బోధన, పరిశోధన రంగాల్లోనే కాకుండా, సమాజాభివృద్ధికి కూడా దోహద పడేలా సహాయ, సహకారం అందించే విషయంలో ఎల్లవేళలా ముందుంటుందని స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా డిప్లొమా కోర్సులను సైతం రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ పద్మనాభం, వైస్‌ ప్రిన్సిపల్‌ వెంకటేశ్వర్లు, డీఓఏ డైరెక్టర్‌ సుధీర్‌, ఇంజినీరింగ్‌ విభాగం డైరెక్టర్‌ ప్రదీప్‌కుమార్‌, డిన్లు, విభాగాధిపతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *