News

Tirupati iskato boom

ఇస్కాతో తిరుపతికి మహర్దశ

ఇస్కాతో తిరుపతికి మహర్దశ
నేటి నుంచి జన్మభూమి ద్వారా ప్రజల వద్దకు
తెదేపా జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: ఇస్కా సదస్సుతో తిరుపతికి మహర్దశ వచ్చిందని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం చిత్తూరులోని తెదేపా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇస్కా కారణంగా తిరుపతి నగరంలో రూ.160 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. మఖ్యమంత్రి చంద్రబాబు చొరవతోనే ఈ సదస్సు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రేణిగుంట విమానాశ్రయం టర్మినల్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి, త్వరలోనే పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రైల్వే పరంగానూ జిల్లా అభివృద్ధి చెందుతోందని, ఇప్పటికే శ్రీకాళహస్తి నడికుడి రైలు ప్రారంభించినట్లు గుర్తుచేశారు.

తిరుపతి విశాఖపట్నం మధ్య డబల్‌డెక్కర్‌ రైలు నడపాలని ప్రతిపాదలు ఉన్నట్లు వెల్లడించారు. రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు సహకారంతో తిరుపతి నుంచి వాస్కోడిగామకు రైలు ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. 2017 లో గాలేరు నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టుల పనులు పూర్తవుతాయని, తద్వారా ఈ ఏడాది చివరకు జిల్లాకు నీరు వస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించిడం హర్షణీయమని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా పెద్ద మొత్తంలో పోలవరానికి నిధులు కేటాయించడం శుభపరిణామమన్నారు.

నేటి నుంచి ప్రారంభం కానున్న జన్మభూమి మావూరు కార్యక్రమం ద్వారా ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించనున్నట్లు చెప్పారు. తెదేపా సభ్యత్వ నమోదులో లక్ష్యానికి మించి సభ్యులను చేర్పించినట్లు వివరించారు. జిల్లాలో 5.6 లక్షల లక్ష్యానికి గాను 6.56 లక్షల మంది తెదేపా సభ్యత్వం తీసుకున్నారన్నారు. ఆపార్టీ జిల్లా సమన్వయ కార్యదర్శి సురేంద్ర కుమార్‌ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని ప్రథహపక్షాలు విమర్శలు చేస్తూ అడ్డు తగులుతున్నట్లు ఆరోపించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు కన్నయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.