News

ఎస్వీయూ.. ఎవరెస్ట్‌

ఎస్వీయూ.. ఎవరెస్ట్‌

హిమాలయ పర్వతాల్లో 5వేల మీటర్ల ప్రయాణం

ఎస్వీయూకు అరుదైన గౌరవం తెచ్చిన కరాటే విద్యార్థులు

ఎవరెస్ట్‌ అధిరోహణకు వెళ్లనున్న ఇద్దరు విద్యార్థులు

సాహస యాత్రలకు పెట్టింది పేరు.. కుర్రకారు. అందరిలోకి తాము ప్రత్యేంగా గుర్తింపు పొందాలన్న వారి తపన ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తుంది. అలాంటి లక్ష్యంతో ప్రయాణాలు ప్రారంభించే నేటితరం యువత అరుదైన గుర్తింపును పొందుతోంది. వ్యక్తిగతంగా వారు గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. విద్యాభ్యాసం చేస్తున్న విద్యాసంస్థలకు సైతం తమ సాహసాలతో కీర్తిప్రతిష్ఠలు తీసుకొస్తున్నారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ఫర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ విభాగానికి చెందిన కరాటే విద్యార్థులు  సాహస యత్రాల్లో అత్యంత కీలకమైన హిమాలయ పర్వతాల్లో ఐదువేల మీటర్ల ప్రయాణం చేసి, అదే సందర్భంలో ఎవరెస్ట్‌ అధిరోహణకు అవసరమైన నైపుణ్య సాధన కోసం ‘హిమాలయన్‌ మౌంటెనీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌’లో బేసిక్‌ కోర్సును సైతం ఎస్వీయూ బృందం పూర్తిచేసింది.

– న్యూస్‌టుడే, తిరుపతి(ఎస్వీ విశ్వవిద్యాలయం)
రాజధాని అమరావతిలో నవంబర్‌లో జరిగిన ఎవరెస్ట్‌ అధిరోహణ రాష్ట్రస్థాయి ఎంపికలకు మొత్తం నలభైమంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో ఎస్వీయూ సీమాస్‌ విభాగానికి చెందిన ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. వారిలో చిన్నికృష్ణ నాయక్‌(బీపీఈడీ), ధనంజయ(బీపీఈడీ), గణేష్‌(మైక్రోబయాలజీ), జశ్వంత్‌(ఎంబీఏ), వరప్రసాద్‌(ఎంసీఏ), మనోజ్‌(డిగ్రీ), శాంభవి(డిగ్రీ) ఉన్నారు. ఎంపికైన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వంలోని యువజన సర్వీసుల సంఘం అధికారులు డార్జిలింగ్‌లోని హిమాలయన్‌ మౌంటెనీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌(హెచ్‌ఎంఐ) తీసుకెళ్లారు. అక్కడ 2017 నవంబర్‌ 29వ నుంచి డిసెంబర్‌ 18వ తేదీ వరకు నలభైమంది రాష్ట్ర బృందంలోని ఎస్వీయూకు చెందిన ఏడుగురు పర్వతారోహణకు సంబంధించి వివిధ మెలకువలను తెలుసుకున్నారు.

5 వేల మీటర్ల లక్ష్య సాధన
హిమాలయ పర్వతాల్లో ఐదువేల మీటర్ల సాహసయాత్రను ఎస్వీయూ బృందం పూర్తిచేసింది. డిసెంబరు తొమ్మిదో తేదీన సిక్కిం రాష్ట్రంలోని యుక్సమ్‌ నగర సరిహద్దులోని కొండప్రాంతాల నుంచి హిమాలయ పర్వతాల అధిరోహణకు ఎస్వీయూ విద్యార్థులు శ్రీకారం చుట్టారు. అలా పదిరోజుల పాటు ప్రయాణించి మొత్తం ఐదువేల మీటర్ల ఎత్తువరకు ఎక్కి నలభై రెండు కిలోమీటర్ల సాహస యాత్రను వారంరోజుల్లో లక్ష్యానికి చేరుకున్నారు. ప్రయాణంలో పలు కొండలను దాటుకుంటూ ప్రయాణాన్ని సాగించినట్లు సీమాస్‌ విద్యార్థులు పేర్కొన్నారు. హిమాలయ పర్వతాల్లోని చోరీకాంగ్‌ ప్రాంతం వరకు తమ ప్రయాణం సాగినట్లు వివరించారు. శిక్షణలో భాగంగా ఆఖరి రోజున 16,500 అడుగుల ఎత్తైన ‘రినాక్‌’ పర్వతాన్ని అధిరోహించడం గమనార్హం.

ఎవరెస్ట్‌ అధిరోహణకు ఆ ఇద్దరు
ఎవరెస్ట్‌ అధిరోహణకు సంబంధించి ప్రాథమిక దశలో తీసుకోవాల్సిన బేసిక్‌ కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన ఎస్వీయూ విద్యార్థులు తదుపరి దశ శిక్షణకు సిద్ధమౌతున్నారు. సీమాస్‌ డైరెక్టర్‌ ఆచార్య సుదర్శనం నేతృత్వంలో ఈ బృందం కఠోర శిక్షణ పొందుతోంది. ఈ నేపథ్యంలోనే ఎవరెస్ట్‌ అధిరోహణకు సంబంధించిన తదుపరి శిక్షణకు రావాల్సిందిగా చిన్నికృష్ణ నాయక్‌, జశ్వంత్‌కు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. తదుపరి శిక్షణ జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోని లడక్‌ ప్రాంతంలో సాగనుంది. హిమాలయ పర్వతాలను అధిరోహించి, బేస్‌క్యాంప్‌ శిక్షణ తీసుకుని ఎస్వీయూకు తిరిగొచ్చిన విద్యార్థులను వీసీ ఆచార్య దామోదరం, సీమాస్‌ డైరెక్టర్‌ ఆచార్య సుదర్శనం అభినందించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *