News

Tiruapti real estate news

కంటిమి.. ఇలవైకుంఠము!

కంటిమి.. ఇలవైకుంఠము!
తిరుమల క్షేత్రంలో ఏకాదశి సందడి
వేకువజామున 4 గంటల నుంచే ధర్మదర్శనం
ఎన్నడూలేనంతగా యాత్రికులు తరలిరాక
4,206 మందికి బ్రేక్‌ దర్శనం పాసుల జారీ

తిరుమల, న్యూస్‌టుడే: పరమపుణ్యధామమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వైకుంఠద్వార దర్శనంతో భక్తకోటి పునీతమైంది. తితిదే కల్పించిన సేవలతో కనువిందుగా శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రదక్షిణతో ఆనందపరవశమైంది. జన్మసార్థకమంటూ సంబరపడిపోయింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం నుంచే తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది.

అర్ధరాత్రి అనంతరం ఆదివారం ఏకాదశి ఘడియలు ప్రవేశించిన తర్వాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధన, వైకుంఠ ఏకాదశి ఆస్థాన క్రతువులను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం వైకుంఠ ద్వారాలను తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. అర్ధరాత్రి 12.30 గంటలకు తితిదే ప్రముఖులకు బ్రేక్‌ దర్శనం కల్పించింది. ప్రముఖులకు మంజూరు చేసిన 4,206 పాసులపై హారతిలేని లఘు దర్శనం కల్పించి ఉదయం 4 గంటల్లోపు పూర్తి చేసింది. వెంటనే సామాన్య భక్తులకు ధర్మదర్శనం ప్రారంభించి మహాలఘు దర్శనం అమలు చేసింది.

సాయంత్రం 6 గంటల సమయానికి 60 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పించింది. అర్ధరాత్రికి 85 వేల మంది దర్శించుకుంటారని అంచనా.. మధ్యాహ్నానికి తిరువీధుల్లో ఉన్న వేలాది మంది భక్తులు నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. సాయంత్రానికి ఇక్కడి తాత్కాలిక కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న యాత్రికులందరూ వైకుఠం-1, 2లోకి చేరుకున్నారు. శనివారం ఉదయం నుంచి తితిదే కల్పించిన పలు సౌకర్యాల పట్ల భక్తులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. వేచి ఉన్న భక్తులకు విస్తృతంగా అన్నపానీయాలను దేవస్థానం అందించింది. క్రమపద్ధతిలో ఆలయానికి ప్రవేశపెట్టి స్వామి దర్శనం, ఉత్తరద్వార ప్రదక్షిణ భాగ్యం కల్పించింది.

ఆలస్యంగా స్వర్ణ రథోత్సవం
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నిర్వహించాల్సిన స్వర్ణరథోత్సవం ఉదయం ఆలస్యంగా ప్రారంభమైంది. కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు నిండిపోవడంతో తిరువీధుల్లోకి వేలాది మంది భక్తుల సమూహం శనివారం రాత్రి చేరిపోయింది. ఉదయం వీరిని క్యూలైన్ల ద్వారా నారాయణగిరి ఉద్యానం మీదుగా వైకుంఠం-1, 2లోకి ప్రవేశపెట్టడానికి పోలీసు యంత్రాంగం తీవ్రంగా శ్రమించింది. క్యూలైన్లలో ప్రవేశానికి యాత్రికులు ఒక్కసారిగా పోటీపడడంతో తోపులాటలకు ఆస్కారం ఉన్న పరిస్థితుల్లో నియంత్రణ చర్యలు చేపట్టారు.

స్వామివారికి తిరువీధుల్లో స్వర్ణరథోత్సవం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. రద్దీ పరిస్థితిని గుర్తించి కొంత ఆలస్యంగా ఉత్సవాన్ని ప్రారంభించారు. యాత్రికులను క్రమబద్ధీకరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిన అనంతరం రథోత్సవం ప్రారంభించారు.
వేలాదిగా తరలివచ్చిన ప్రముఖులు తిరుగు ప్రయాణంతో భక్తులకు సులభంగా అద్దె గదులు లభించాయి. వేకువజామున 4 గంటల నుంచే భక్తులకు తేనీటి పానీయంతో పాటు అల్పాహారం తితిదే అందించింది.
శ్రీవారి ఆలయ సమీపంలో సప్తద్వారాలతో ఏర్పాటు చేసిన శ్రీమహావిష్ణువు అలంకరణ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.



 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *