News

క్రీడలతో ఉజ్వల భవిత

క్రీడలతో ఉజ్వల భవిత

డీఎస్పీ రామ్‌కుమార్‌

  దక్షిణ ప్రాంత అంతర విశ్వవిద్యాలయాల

టెన్నిస్‌ టోర్నీ ప్రారంభం

తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: యువతకు క్రీడల ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చిత్తూరు సెష్పల్‌ బ్రాంచి డీఎస్పీ రామ్‌కుమార్‌ పేర్కొన్నారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో దక్షిణ ప్రాంత అంతర విశ్వవిద్యాయాల పురుషుల టెన్నిస్‌ టోర్నమెంట్‌ మంగళవారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా డీఎస్పీ రామ్‌కుమార్‌, ఎస్వీయూ వీసీ ఆచార్య దామోదరం, రెక్టార్‌ భాస్కర్‌లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం క్రీడా బెలూన్లు గాలిలోకి ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ క్రీడల ద్వారానే తనకు పోలీసు శాఖలో మొదట ఎస్సైగా ఉద్యోగం లభించిందని, నేడు డీఎస్పీ స్థాయిలో ఉన్నానని తెలిపారు. క్రీడలకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని, గ్రామీణ క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్వీయూ వీసీ ఆచార్య దామోదరం మాట్లాడుతూ టెన్నిస్‌ పోటీలకు ఎస్వీయూ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ క్రీడాకారులు క్రీడలపై అవగాహన లేక  వెనుకబడిపోతున్నారని చెప్పారు. వారిని ప్రోత్సహించేందుకు తమ వర్సిటీ ఎప్పుడూ ముందుంటుందని వెల్లడించారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన క్రీడాకారులను వారు పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో వ్యాయామ విద్యా విభాగం డైరెక్టర్‌ కృష్ణమూర్తి, డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.శివశంకర్‌రెడ్డి, సహాయ డైరెక్టర్‌ గిరిధర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

మొదటిరోజు ఏడు మ్యాచ్‌లు
మొదటి రోజు మొత్తం ఏడు మ్యాచ్‌లు జరిగాయి. మొదటగా యోగి వేమన విశ్వవిద్యాలయం(కడప) జట్టు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం(కొట్టాయం) జట్టుపై 9-2, 9-1, 9-0 తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో జేఎన్‌టీయూ(కాకినాడ) జట్టు అన్నామలై విశ్వవిద్యాలయం(చిదంబరం) జట్టుపై 9-1, 9-3, 9-3 తేడాతో గెలుపొందింది. మూడో మ్యాచ్‌లో కామరాజ్‌ విశ్వవిద్యాలయం(మధురై) జట్టు రాణి చిన్మయ విశ్వవిద్యాలయం(బెల్గాని) జట్టుపై 9-1, 9-2, 9-2 తేడాతో విజయం సాధించింది. నాలుగో మ్యాచ్‌లో ఎంఎస్‌ విశ్వవిద్యాలయం(తిరునల్వేలి) జట్టు తన ప్రత్యర్థి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ విశ్వవిద్యాలయం(తమిళనాడు) జట్టుపై 9-6, 9-3, 9-2 తేడాతో విజయ సొంతం చేసుకుంది. ఐదో మ్యాచ్‌ మణిపాల్‌ విశ్వవిద్యాలయం జట్టు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం(గుంటూరు) జట్టుపై 9-1, 9-1, 9-3 తేడాతో గెలుపొందింది. ఆరో మ్యాచ్‌లో అమ్రిత విశ్వ విద్యాపీఠం(కోయంబత్తూరు) జట్టు తన ప్రత్యర్థి కె.ఎల్‌.యూనివర్సిటీ(గంటూరు) జట్టుపై 9-1, 9-1, 9-6 తేడాతో విజయం సాధించింది. ఏడో మ్యాచ్‌లో అన్నా విశ్వవిద్యాలయం(చెన్నై) జట్టు గీతం విశ్వవిద్యాలయం (విశాఖ) జట్టుపై 9-2, 9-2, 9-4 తేడాతో గెలుపొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *