News

Salute to the teacher

గురువుకు వందనం

గురువుకు వందనం

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా సుబ్రహ్మణ్యంరెడ్డి

బడిఈడు పిల్లలు అందరూ చదువుకోవాలి.. అందులోనూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలన్నది ఆయన ఆశ. దానినే ఆశయంగా మార్చుకుని.. పనిచేసిన ప్రతి పాఠశాలలోనూ.. విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ వస్తున్నారు. విద్యాబోధన.. ఆటలు.. మంచి ఫలితాల సాధనలోనూ పిల్లలను తీర్చిదిద్దుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీకాళహస్తిలోని ఆర్‌పీబీఎస్‌ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కామిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి. ఈయన సేవలను గుర్తించిన ప్రభుత్వం.. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా సత్కరించనుంది.

-న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

ఏర్పేడు మండలం అంజిమేడుకు చెందిన సుబ్బరామిరెడ్డి, సుబ్బమ్మల సంతానం కాపిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువును సాగించారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో పనిచేశారు. ప్రస్తుతం శ్రీకాళహస్తిలోని ఆర్‌పీబీఎస్‌ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. విద్య అన్నది వెలకట్టలేని ఆస్తిగా ఆయన నమ్ముతారు. అందుకే ప్రతి పిల్లవాడు చదువుపై ఆసక్తిని కల్గించడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు.

1997లో పుంగనూరు మండలం అగస్తీశ్వర కొత్తకోట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆయన పనిచేసే సమయంలో విద్యార్థులకు అన్నీ విభాగాలు బోధించేవారు. అక్కడి గ్రామానికి దగ్గరలోని కొండయ్యగారిపల్లి నుంచి విద్యార్థులు పాఠశాలకు రావాలంటే వాగు దాటి రావాల్సి వచ్చేది. చాలా మంది విద్యార్థులు అవస్థలు పడేవాళ్లు. ఈయన సొంత నిధులతో.. వాగుపై చిన్నపాటి వంతెనను ఏర్పాటు చేయించారు. అక్కడి విద్యార్థులందరూ సక్రమంగా పాఠశాలకు వచ్చి.. ఎంతో మంది విద్యాధికులు కావడం విశేషం.

1998-2001 వరకు శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలులో ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. అప్పట్లో అక్కడ పాఠశాల భవనం లేదు. సమీపంలోని పాండురంగయ్యస్వామి ఆలయంలోనే పాఠశాల జరుగుతూ వచ్చేది. విద్యార్థుల కష్టాలను గుర్తించిన గ్రామస్థులు, విద్యాశాఖ అధికారుల సహకారంతో గ్రామానికి సమీపంలోని పది ఎకరాల గోపొరంబోకు భూముల్లో పాఠశాల భవనాల నిర్మాణం చేయించారు. ప్రస్తుతం అక్కడి పాఠశాల విశాలమైన భవన సముదాయంతో విద్యార్థులకు బాసటగా నిలవడం గమనార్హం.

2001 నుంచి 2009 వరకు.. ఆర్‌పీబీఎస్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అప్పట్లో రాత్రి పూట తరగతులు నిర్వహించేవాళ్లు కాదు. ఈయన పిల్లలకు రాత్రి పూట తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కృషి చేశారు. జోనల్‌ క్రీడల నిర్వహణలోనూ అప్పట్లో ఈయన కీలక పాత్ర పోషించారు.

2013లో.. బీఎన్‌కండ్రిగ మండలం చల్లమాంబపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఉంటూ అక్కడి క్రీడామైదానాన్ని అభివృద్ధి చేశారు. విద్యార్థుల భాగస్వామ్యంతో పాఠశాల పరిశుభ్రత, పచ్చదనం పెంపు తదితర కార్యక్రమాలు చేపట్టారు.