News

ctr-sty1a (1)

ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు

ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుచానూరు, న్యూస్‌టుడే: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తోన్న వార్షిక పవిత్రోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా చివరిరోజు ఉదయం అయిదు గంటలకు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన పూజలు చేశారు. ఉదయం 9గంటలకు శ్రీపద్మావతీ అమ్మవారు, విష్వక్సేనుడు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీసుందరరాజస్వామి, రుక్మిణీసత్యభామ సమేత శ్రీసుందరరాజస్వామి ఉత్సవమూర్తులను వేంచేపుగా యాగశాలకు తీసుకొచ్చి కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ముందు రోజు ఉత్సవమూర్తులకు అలంకరించిన పవిత్రమాలలను విసర్జన చేశారు.యాగశాలలో పూర్ణాహుతి, మహాశాంతి హోమం, కుంభప్రోక్షణ, తీర్థప్రసాదాల గోష్టి చేశారు.మధ్నాహం మూడుగంటలకు యాగశాలలోని ఉత్సవమూర్తులకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు.సాయంత్రం అలంకార శోభితులైన దేవతామూర్తులు తిరుచ్చి వాహనంపై తిరుమాడ వీధుల్లో వూరేగుతూ భక్తులను సాక్షాత్కరించారు.పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు దేవతామూర్తులను దర్శించుకుని మంగళహారతులు పట్టారు. రాత్రి 10గంటలకు జరిగిన ఏకాంత సేవతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.గత మూడు రోజులగా రద్దు చేసిన ఆర్జితసేవలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి.ముగింపు కార్యక్రమంలో తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈవో పోల భాస్కర్‌, ఆలయ డిప్యూటీ ఈవో మునిరత్నం రెడ్డి, ఆలయ పేష్కార్‌ రాధాకృష్ణ, సూపరింటెండెంట్లు రవి, మాధవ కుమార్‌, ఏవీఎస్‌వో పార్థసారధి, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
నేత్రపర్వంగా చక్రత్తాళ్వార్‌ చక్రస్నానం..
అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాల్లో చివరిరోజు బుధవారం పద్మ సరోవరంలో చక్రత్తాళ్వార్‌ చక్రస్నానం ఘట్టాన్ని నేత్రపర్వంగా నిర్వహిం చారు.ఇందులో భాగంగా సాయంత్రం నాలుగు గంటలకు ఆలయంలోని చక్రత్తాళ్వార్‌ను వూరేగింపుగా పద్మసరోవరంలోని మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు.అనంతరం సుగంధ పరిమళ ద్రవ్యాలైన పాలు,పెరుగు, తేన, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో చక్రత్తాళ్వార్‌కు తిరుమంజ నం చేశారు.భక్తుల నామస్మరణల నడుమ పద్మసరోవరంలో చక్రత్తా ళ్వార్‌కు అర్చకులు మూడుపర్యాయలు చక్రస్నానం చేయించారు.ఆ సమయంలో చక్రత్తాళ్వార్‌తో పాటు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.