News

National Highway Expansion

చెన్నై – బెంగళూరు జాతీయ రహదారి విస్తరణకు రూ.1,600 కోట్లు

చెన్నై – బెంగళూరు జాతీయ రహదారి విస్తరణకు రూ.1,600 కోట్లు
త్వరలో ముఖ్యమంత్రిచే భూమిపూజ
పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి

గంగవరం, న్యూస్‌టుడే: జిల్లాలో జాతీయ రహదారి విస్తరణ, బైపాస్‌ నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్‌.అమరనాథరెడ్డి తెలిపారు. జిల్లాలో పారిశ్రామికరంగాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం అన్నివిధాలా ప్రయత్నిస్తుందని, ఇందులో భాగంగా రవాణా సౌకర్యం మెరుగుకు భారీ నిధులతో విస్తరణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో చెన్నై- బెంగళూరు జాతీయ రహదారి విస్తరణ, బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.1,600 కోట్లు మంజూరు చేశారని, త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమిపూజ చేస్తున్నట్లు తెలిపారు. రూ.300 కోట్లతో చేపట్టిన మదనపల్లె – పలమనేరు జాతీయ రహదారి విస్తరణ పనులు ఇప్పటికే 40 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. గోదావరి – కృష్ణా నదుల అనుసంధానంతో కుప్పం, పలమనేరు నియోజకవర్గాల ప్రజల తాగు, సాగు నీటి కష్టాలకు తెర పడుతుందన్నారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల ప్రజలకు హంద్రీ – నీవా నీరే కాకుండా గాలేరు- నగరి పథకంలోని అడవిపల్లె రిజర్వాయర్‌ నుంచి తాగు, సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమానికి జిల్లాలో పెట్టుబడి రాయితీ కింద రూ.16 కోట్లు రైతులకు అందజేసినట్లు చెప్పారు. జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి, వలసలను అరికడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు సంయుక్త పాలనాధికారి చంద్రమౌళి, హౌసింగ్‌ పీడీ ధనుంజయులు, తెదేపా జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మనోహర్‌ నాయుడు, జిల్లా కోశాధికారి ఆర్వీ బాలాజీ, అన్ని మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *