News

జంగమయ్య క్షేత్రం.. జాతర సంబరం

జంగమయ్య క్షేత్రం.. జాతర సంబరం

అత్యంత వైభవంగా ఏడుగంగల జాతర

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: సమస్త లోకాలను సంరక్షించే.. కరుణాసముద్రిగా.. ఆర్తుల పాలిట అండగా ఉంటూ.. భక్తుల కొంగుబంగారమైన గంగమ్మ వేడుకలతో జంగమయ్య క్షేత్రం పులకించిపోయింది. ఏడుగంగల జాతర సంబరాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీకాళహస్తి పట్టణం సందడిగా మారింది. పట్టణంలోని ఏడు ప్రదేశాల్లో ఒక్కో చోట ఒక్కో పేరుతో.. ఒక్కో దివ్యమైన అలంకారంతో.. కొలువుదీరిన సప్తమాతృకల శక్తి స్వరూపిణిలను దర్శించుకునేందుకు జనం అశేషంగా తరలివచ్చారు. ఆయా ప్రాంతాల్లో అక్కడి జాతర నిర్వాహక కమిటీ సభ్యులు తమదైన రీతిలో పోటాపోటీగా ఏర్పాట్లు చేపట్టారు. విశేష పుష్పాలు, రంగురంగుల విద్యుద్దీపాలు, విశేష దివ్య ప్రభల మధ్య.. గంగమ్మల సంబరాలతో పుణ్యక్షేత్రం పులకించిపోయింది.

శ్రీ పెళ్లిమండపం వద్ద పొన్నాలమ్మకు వెండి ఉడుపులతో పాటు.. చుట్టూ ఫల, పుష్పాలతో ఏర్పాటు చేసిన అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీ గాంధీవీధిలోని అంకమ్మ పలు చేతుల్లో ఆయుధాలను ధరించి.. అసుర సంహారిణిగా దర్శనమిచ్చారు. శ్రీ కొత్తపేటలో కొలువుదీరిన భువనేశ్వరి అమ్మవారు నిలువెత్తు రూపంతో.. భక్తకోటిని అనుగ్రహించేందుకు వచ్చిన కల్పవల్లిగా దర్శనభాగ్యం కల్పించారు. శ్రీ జయరామారావు వీధిలోని కావమ్మను ఈ దఫా అత్యంత ప్రత్యేకంగా సిద్ధం చేశారు. చుట్టూ సప్తమాతృకల స్వరూపాలతో పాటు నాగదేవతల మధ్య అమ్మవారి స్వరూపం, చుట్టూ అమర్చిన ఏర్పాట్లు భక్తజన ఆకర్షణగా నిలిచాయి.శ్రీ బేరివారి మండపం వద్ద మహిషాసురుని వాహనంగా.. గజరాజుల మధ్య ముత్యాలమ్మగా అమ్మవారు సుందర రూపం భక్తకోటిని మరింతగా ఆకట్టుకుంది. శ్రీ సన్నిధివీధి రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన అంకాళమ్మ ఈ దఫా రజతమూర్తిగా దర్శనమిచ్చారు. పుష్పాలతో తయారు చేసిన హంస ప్రభ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీ ఇక చిట్టచివరిగా తేరువీధిలో కొలువుదీరిన.. నల్లగంగమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మగా, ఎంతో ఆకర్షణీయమైన అలంకారంతో కొలువుదీరారు. విద్యుద్దీపాలతో అమ్మవారి చుట్టూ ఏర్పాటు చేసిన ప్రభలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి.