News

నేత్రోత్సవం.. గురుసంక్రమణ దివ్యోత్సవం

నేత్రోత్సవం.. గురుసంక్రమణ దివ్యోత్సవం

మేధోదక్షిణామూర్తికి విశేష అభిషేకాలు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ప్రసిద్ధ శైవక్షేత్రంగా.. పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురుసంక్రమణ మహోత్సవం మంగళవారం ఆద్యంతం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కొలువుదీరిన శ్రీమేధో దక్షిణామూర్తికి అష్టోత్తర శత శంఖాభిషేకాన్ని ఘనంగా చేపట్టారు. ఆలయంలోని దక్షిణామూర్తి సన్నిధి వద్ద సంకల్పపూజలు ఘనంగా జరిపారు. పంచమగ్రహమైన..గురువు కన్యారాశి నుంచి తులారాశిలోనికి ప్రవేశించే సందర్భంగా ఈ మహోత్సవాన్ని కనుల పండువగా జరిపారు. వేేదవాజ్ఞ్మయానికి ఆదిగురువుగా కొలువుదీరిన శ్రీమేధో దక్షిణామూర్తికి విశేష పూజలు, ప్రత్యేక అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీదక్షిణామూర్తి సన్నిధి వద్ద ప్రధాన యాగకలశంతో పాటు నవకలశాలు, 108 శంఖువుల్లో పవిత్ర జలాన్ని ఉంచారు. దీక్షాగురుకుల్‌ రాజేష్‌గురుకుల్‌ ఆధ్వర్యంలో శైవాగమ పద్ధతిలో కలశస్థాపన చేసి ప్రత్యేక పూజలు జరిపారు.

స్వామి వారికి తొలుత గోక్షీరం, పంచామృతం, నారికేళజలం, చందనం, విభూదిలతో ఆలయ అర్చకులు విశేష అభిషేకాలు జరిపారు. మేళతాళాలు, భక్తుల శివనామస్మరణలతో ముక్కంటి ఆలయం మార్మోగింది. పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశాక యాగకలశంలోని పవిత్రజలంతో స్వామి వారిని అభిషేకించారు. బంగారు తాపడంతో చేయించిన విశేష ఉడుపులతో పాటు విశేష పుష్పాలతో అలంకరణలు జరిపారు. అలంకార మండపంలో శ్రీగురుదక్షిణామూర్తి ఉత్సవమూర్తికి విశేష పూజలు జరిపారు. ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. ఆలయం తరఫున భక్తులకు తీర్థం, చందనం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు గురవయ్యనాయుడు, ఈవో భ్రమరాంబ, జయగోపాల్‌, పి.ఎం.చంద్ర, లోకనాథంనాయుడు, నారాయణయాదవ్‌, ప్రమీల, మాజీ ఛైర్మన్‌ శాంతారాం జె.పవార్‌, అంజూరు శ్రీనివాసులు, ఎక్స్‌అఫిషియో సభ్యుడు సంబంధం గురుకుల్‌, ముఖ్య అర్చకులు కర్ణాగురుకుల్‌, ఆలయ ఏఈవో ఎన్‌.ఆర్‌.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.