News

పాఠశాలల్లో రోజువారి పాఠ్యాంశంగా యోగా

పాఠశాలల్లో రోజువారి పాఠ్యాంశంగా యోగా

జిల్లా కలెక్టరు ప్రద్యుమ్న

రాష్ట్రస్థాయి యోగాసన క్రీడా ఛాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభం


తిరుపతి(క్రీడలు), న్యూస్‌టుడే: మన పూర్వీకులు మనశ్శాంతి కోసం యోగాను ఆచరణలోకి తీసుకురాలేదని.. వ్యక్తిగత శక్తి, సామర్థ్యం పెంచడానికి తీసుకువచ్చారని జిల్లా కలెక్టరు ప్రద్యుమ్న పేర్కొన్నారు. తిరుపతి శ్రీపద్మావతి కల్యాణ మండపంలో శనివారం రాష్ట్ర, జిల్లా యోగా సంఘం సంయుక్తంగా రాష్ట్ర స్థాయి యోగాసన క్రీడా ఛాంపియన్‌షిప్‌-2017 పోటీలను ఆయన ప్రాంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ప్రయోగాత్మకంగా 620 ఉన్నత పాఠశాలల్లో యోగాను రోజువారి పాఠ్యాంశంగా బోధన చేయిస్తున్నట్లు వివరించారు. దీంతోపాటు ప్రయోగాత్మకంగా గ్రామీణ స్థాయి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ‘యోగా గ్రామ్‌’ పేరుతో యోగా శిక్షకులతో శిక్షణ అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. 8 ఏళ్ల నుంచి యోగా సాధన ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుయోగాకు విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాసన క్రీడా ఛాంపియన్‌షిప్‌కు విచ్చేసిన వేయి మంది క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. జిల్లాలో యోగాభివృద్ధికి జిల్లా యోగా సంఘం సహకారం ఎంతో అవసరం ఉందని సూచించారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు నరసింహయాదవ్‌ మాట్లాడుతూ జిల్లా పాలనాధికారి చొరవతో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువగా తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. జిల్లా యోగా సంఘం ముఖ్యులు డాక్టరు కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లా పాలనాధికారి ప్రద్యుమ్న ఆదేశాలు, సూచనల మేరకు ప్రతిగ్రామానికి యోగా శిక్షణ తీసుకువెళ్లడానికి జిల్లా యోగా సంఘం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర యోగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కేఎస్‌ రామారావు, వీవీ రామారావు, జిల్లా యోగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు లలిత, శ్రీనివాసులు నాయుడు, ఎన్‌.రాజారెడ్డి, విద్యాసంస్థల అధినేతలు తమ్మినేని వేంకటేశ్వర్లు, విశ్వనాథరెడ్డి, తెదేపా నాయకులు గాలి భానుప్రసాద్‌, దేవానందనాయుడు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడలో రాణిస్తున్న ఆర్‌.జమునారాణిని జిల్లా యోగా సంఘం తరఫ¾ున జిల్లా పాలనాధికారి ప్రద్యుమ్న సత్కరించి జ్ఞాపిక అందించారు. అనంతరం యోగాసనాలు ప్రదర్శించిన చిన్నారులు సిద్ధార్థ, ఉదయశ్రీ, హరిత, గేయామృత, యుక్తలకు జ్ఞాపికలు అందించి సన్మానించారు. వీరితోపాటు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంగీత, నృత్య కార్యక్రమాలతో అలరించిన తులసి, పార్వతి, పవిత్రలను సత్కరించారు.