News

భక్తకోటి.. ఆనందంతోటి

భక్తకోటి.. ఆనందంతోటి
పర్వదినాలు… ప్రశాంతం
మూడేళ్లుగా వరుస విజయాలు
క్రమంగా పెరిగిన యాత్రికుల సంఖ్య

తిరుమల, న్యూస్‌టుడే: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు సోమవారం ప్రశాంతంగా పరిసమాప్తమయ్యాయి. తితిదే ఈవో సాంబశివరావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మూడుసార్లు వైకుంఠ ఏకాదశి పర్వదినాలు వచ్చాయి. గత అనుభవాలతో భక్తకోటికి విశేషంగా సేవలు అందిస్తూ తితిదే ప్రతిష్ఠను ఇనుమడింపచేయడానికి కృషి చేశారు. దేవస్థానంపై నమ్మకంతో యాత్రికులు క్రమంగా పెరుగుతున్నారు. గత రెండు వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలకంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకుని వైకుంఠద్వార దర్శనం చేసుకుని పునీతులయ్యారు.

గతంలో తలెత్తిన పరిస్థితులు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రశాంత వాతావరణంలో స్వామి దర్శనభాగ్యం కల్పించారు. గత రెండు రోజులుగా చిన్నపాటి ఘటనలు కూడా లేకుండా భక్తులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం నుంచి ధర్మదర్శనం 4 గంటల వ్యవధిలో పూర్తి చేశారు. మధ్యాహ్నం అనంతరం కొంత సమయం అధికంగా తీసుకుంది. తిరుపతి పరిసర ప్రాంతాల భక్తులు శ్రీవారిని ద్వాదశి పర్వదినం సందర్భంగా దర్శించుకున్నారు. గత మూడు రోజులుగా ఈవో సాంబశివరావు భక్తుల మధ్యే ఉంటూ భక్తులకు సేవలందించడానికి కృషి చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంతో మెరుగైన ఏర్పాట్లు చేయించారు.

నిత్య అన్నప్రసాదం ట్రస్టు ద్వారా అన్నపానీయాలు విస్తృతంగా వితరణ చేశారు. వేలాది మందితో తిరుమల క్షేత్రం నిండిపోయినా పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రముఖులకు, సామాన్య భక్తులకు వసతి కల్పన విభాగం బస ఏర్పాట్లు చేసింది. భక్తకోటిని విశేషంగా ఆకర్షించేలా ఫల, పుష్పాలంకరణను దేవస్థానం ఉద్యానవన విభాగం చేపట్టింది. ఆలయ సమీపంలో శ్రీమహావిష్ణువు ప్రతిమను ఏర్పాటు చేసి భక్తకోటిని ఆకర్షించేలా ఏర్పాట్లు చేపట్టింది.

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను ప్రశాంతంగా నిర్వహించడానికి రథసారథి బాధ్యతలు నిర్వహించిన తితిదే ఈవో సాంబశివరావుకు భక్తులు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. స్వీయ పర్యవేక్షణతో అన్నింటా తానై పర్వదినాలను విజయవంతంగా పూర్తి చేయడానికి కృషి చేశారు. సోమవారం పగలు, రాత్రంతా ఈవో ఆలయంలోనే గడిపారు.