News

Visva vikasam

‘విశ్వ’వికాసం

‘విశ్వ’వికాసం
‘ఇస్కా’తో తిరుపతి వర్సిటీలకు ప్రపంచ కీర్తి
ప్రధాన వేదికగా ఆకట్టుకున్న ఎస్వీయూ
బాలల కాంగ్రెస్‌తో ఎస్పీఎంయూ సందడి
ఐదు రోజుల్లో మూడు లక్షల మందికి ఆతిథ్యం
ఎస్వీ విశ్వవిద్యాలయం, మహిళా విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే:

తిరుపతిలోని విశ్వవిద్యాలయాల ఖ్యాతి వికసించింది. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌(ఇస్కా) 104వ వార్షిక సదస్సుకు ఆతిథ్యమివ్వడం, భారత ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్లను భాగస్వామ్యం చేసి సదస్సును దిగ్విజయంగా పూర్తిచేయడంతో మన వర్సిటీల పేర్లు జాతీయ స్థాయిలో మార్మోగాయి. తిరునగరికి ఇదో అనుభవ పూర్వక చరిత్ర కానుంది..

విజ్ఞాన పండుగ నిర్వహణలో వర్సిటీల ఘనత భవిష్యత్తు ప్రగతికి దోహదపడనుంది. విద్యార్థులు, పరిశోధకులకు జాతీయ స్థాయిలో ఏర్పడిన సత్సంబంధాలు వారి భవిష్యత్తుకు బాటలు పరచనున్నాయి. అరవై వసంతాలు పూర్తిచేసుకున్న ఎస్వీయూ, మూడు దశాబ్దాల చరిత్ర గల మహిళా వర్సిటీ.. ఇస్కా విజయంతో నూతన నేపథ్యాన్ని సంతరించుకుని ముందుకు సాగనున్నాయి.

దారులన్నీ ఎస్వీయూకే..
వివిధ విదేశీ విశ్వవిద్యాలయాలతో పరిశోధన ఒప్పందాలు, అంతర్జాతీయ స్థాయి ఆధునిక విధానాలతో బోధన.. ఫలితంగా శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య దామోదరం నేతృత్వంలో వర్సిటీ జాతీయస్థాయిలో 63వ ర్యాంకును, దక్షిణ భారతదేశంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇస్కా నేపథ్యంలో ఎస్వీయూకు విచ్చేసిన నోబెల్‌ ఆరేటర్స్‌ వర్సిటీ సాధించిన ప్రగతిని కొనియాడారు.

ఎస్వీయూ వేదికగా ‘ఫిజికల్‌ సైన్సెస్‌’, ‘లైఫ్‌ సైన్సెస్‌’, ‘సోషల్‌ సైన్సెస్‌’, ‘ఆర్ట్స్‌’ విభాగాలు వేటికవే ప్రత్యేకతను సాధించుకుని ముందుకెళ్తున్నాయని నోబెల్‌ పురస్కార గ్రహీతలు ప్రశంసించారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుపతి నగరంలో ఎస్వీయూ సాధించే ప్రగతి విశ్వవ్యాప్తంగా చర్చకు దోహదపడుతుందని, ఈ స్ఫూర్తితో మరిన్ని ర్యాంకులు వర్సిటీ సాధించాలని వారు సూచించారు.

మూడు లక్షల మంది విజ్ఞాన యాత్ర
ఇస్కా సదస్సులో ఏర్పాటు చేసే ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిబిషన్‌ సాధారణంగా ప్రతినిధులకే పరిమితమవుతుంది. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనతో జిల్లా విద్యార్థులతో పాటు, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినవారు తిలకించేందుకు విచ్చేశారు. పది ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఐదు రోజుల్లో మూడు లక్షల పైచిలుకు విద్యార్థులు, ప్రజలు సందర్శించారు. ఈ విజ్ఞాన ప్రదర్శన విద్యార్థులకు ప్రయోగాత్మక అవగాహన కలిగించిందని ఇస్కా స్థానిక కో-ఆర్డినేటర్‌ ఆచార్య విజయభాస్కర్‌రావు కార్యాలయం పేర్కొంది.

ఇస్రో, డీఆర్‌డీఓ, యూజీసీ, ఏపీ ఉన్నత విద్యాశాఖ, డీఎస్‌టీ, డీబీటీ తదితర పరిశోధన సంస్థలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. అంతరిక్ష, కాలుష్య, వాతావరణ, మానవ ఆరోగ్యం, ఔషధ మొక్కలు తదితర అంశాలపై అంతర్జాతీయ పరిశోధనల గురించి విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోగలిగారు. తిరుపతి చరిత్రలో ఇంత గొప్ప ఎగ్జిబిషన్‌ను గతంలో ఎన్నడూ నిర్వహించిన దాఖలాలు లేవు. ఇస్కా ఆతిథ్యం ఒకెత్తైతే.. ప్రధానంగా ఎగ్జిబిషన్‌ నిర్వహణ వర్సిటీ ఖ్యాతిని అమాంతం పెంచేసింది.

సౌకర్యాల కల్పనలో సంయుక్త భాగస్వామ్యం
ఇస్కాకు విచ్చేసిన ప్రతినిధులకు సౌకర్యాల కల్పనలో ఎస్వీయూ, తితిదే సంయుక్త కృషి చేసింది. ఫలితంగా ఎక్కడా.. ఎలాంటి.. ఇబ్బందులు లేకుండా ప్రతినిధులు తమ పర్యటనను ముగించగలిగారు. వేలాది మంది ప్రతినిధులకు శ్రీవారి దర్శనం కల్పించారు. ప్రతిరోజు పదిహేనువేల మంది పైచిలుకు ప్రతినిధులు, వెంట వచ్చిన అతిథులకు ఉత్తర, దక్షిణ భారతదేశ వంటకాలను వడ్డించడంతో వర్సిటీ ప్రతిష్ఠ ఇనుమడించింది.