News

Pious festivals

వైభవంగా అమ్మవారి పవిత్రోత్సవాలు

వైభవంగా అమ్మవారి పవిత్రోత్సవాలు

తిరుచానూరు, న్యూస్‌టుడే: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. నిత్యపూజా కైంకర్యాలు, ఉత్సవాలలో జరిగే తప్పులను మన్నించమని కోరడంతో పాటు భక్తులు జాత, మృత శౌచనం పాటించకుండా అలయ ప్రవేశం చేయడం ద్వారా వచ్చే అనర్ధాలకు పరిహారంగా పవిత్రోత్సవాలను నిర్వహించడం అనవాయితీ. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు హోమాధి కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం ఐదు గంటలకు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన పూజలు చేశారు. ఉదయం ఏడు గంటలకు ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి ఉత్సవమూర్తిని వూరేగింపుగా యాగశాల తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనుబంధ ఆలయాల్లోని రుక్మిణీ, సత్యభాత సమేత శ్రీకృష్ణస్వామి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీసుందరరాజస్వామివారు, విష్వక్సేనులు తదితర దేవతామూర్తులను కూడా యాగశాలో వేంచేపు చేశారు. ధ్వజాతోరణం, ధ్వజకుంభారాధన ఆవాహం, చక్రాధి మండలపూజ, అగ్నిప్రతిష్ట, పవిత్రప్రతిష్ట తదితర హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెండవ విడత యాగశాలలో హోమాధి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో మునిరత్నంరెడ్డి, పేష్కార్‌ రాధాకృష్ణ, సూపరింటెండెంట్లు రవి, మాధవకుమార్‌, ఏవీఎస్‌వో పార్థసారధి, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం..
శ్రీపద్మావతీ అమ్మవారి పవిత్రోత్సవాలో భాగంగా సోమవారం స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం మూడు గంటలకు యాగశాలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుమంజనం ఆధ్యంతం వేడుకగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

నేడు పవిత్రాల సమర్పణ
అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం పవిత్రమాలల సమర్పణ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆలయంలో పవిత్రమాలల వూరేగింపు, సమర్పణ, హోమాధి పూజలు నిర్వహించనున్నారు. శ్రీపద్మావతీ అమ్మవారితో పాటు, ఉత్సవమూర్తులు, అనుబంధ అలయాలు, పరివారదేవతలకు, ఆనందనిలయం, మహాద్వారం గోపురంపై పవిత్రమాలలు అలంకరించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.05 నుంచి 12.30 గంటల మధ్య జరిగే మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పవిత్రోవాలు ముగియనున్నాయి. అదే రోజు సాయంత్రం యాగశాలలో కొలువుదీరిన దేవతామూర్తులు అందరూ ఒకేసారి తిరుమాడ వీధుల్లో వూరేగనున్నారు.