News

వైకుంఠ ప్రదక్షిణం.. పుష్కర స్నానం పరమపావనం…

వైకుంఠ ప్రదక్షిణం.. పుష్కర స్నానం పరమపావనం…

పర్వదినాలు పరిసమాప్తం

లక్షలాదిగా వైకుంఠ ద్వార ప్రదక్షిణ

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల దివ్యక్షేత్రం పరంగా అత్యంత విశేషమైన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు పరిసమాప్తమయ్యాయి. రెండు పర్వదినాల్లో భక్తకోటి ఆధ్యాత్మికానందంతో తరించింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఘడియల్లో శ్రీవారిని దర్శించి ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో ప్రవేశించి దివ్యానుభూతిని పొందింది. శుక్రవారం వేకువజామున వైకుంఠ ఏకాదశి ఘడియల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు రంగురంగుల విద్యుద్దీపాలతో, పరిమళాలు వెదజల్లుతున్న వర్ణరంజిత పుష్పాలతో అహ్లాదంగా అలంకరించిన వైకుంఠ  మార్గంలో ప్రవేశించి పునీతులైంది. దేశవిదేశాల నుంచి భక్తజనులు తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశిని భక్తిశ్రద్ధలతో ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదనే విశ్వాసంతో తరలివచ్చిన యాత్రికుల గోవింద నామస్మరణతో సప్తగిరులు ధ్వనించాయి. ముక్కోటి ప్రదక్షిణ కోసం భక్తులు పోటీపడుతూ స్వామి సన్నిధికి చేరుకుని తమ సంకల్పాన్ని పరిపూర్ణం చేసుకున్నారు. చలి తీవ్రతను ఛేదించుకుంటూ స్వామిసేవలో తరించారు. మూడున్నర కోట్ల తీర్థాలు, పుష్కరుణులు దివ్యసూక్ష్మరూపంలో లీనమైన శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్రత్తాళ్వారుకు అభిషేకం, పవిత్రస్నానం జరిగింది. వేలాది మంది యాత్రికులు పవిత్ర స్నానాలు ఆచరించారు. గోవిందమాల ధరించిన భక్తులు పవిత్రంగా ఇరుముడులు సమర్పించుకుని ధన్యులయ్యారు. అంతకుముందు శనివారం తెల్లవారుజామున స్వామివారికి తిరుప్పావై పఠన నివేదన, ధనుర్మాసం కైంకార్యాల అనంతరం 3 గంటల నుంచే ధర్మదర్శనం ప్రారంభమైంది. అనంతరం విరామం లేకుండా రాత్రి 7.30 గంటల వరకు కొనసాగింది. ఈ సమయంలో నైవేద్య విరామం అనంతరం తిరిగి దర్శనం ప్రారంభించారు. అర్ధరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలు శాస్త్రోక్తంగా మూసివేశారు. శనివారం ముందస్తుగా కొనుగోలు చేసిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లపై 5 వేల మందిని దర్శనానికి అనుమతించారు. సాయంత్రం 4 గంటల నుంచి తితిదే ఉద్యోగులు, కుటుంబ సభ్యులను, పోలీసు సిబ్బందిని శ్రీవారి దర్శనానికి అనుమతించారు. యాత్రికుల రద్దీ శనివారం కూడా కొనసాగింది. సాయంత్రం వరకు వేలాది మంది వరుసల్లోకి వచ్చి చేరుతుండడం కనిపించింది. ఆళ్వారు చెరువు చుట్టూ ఉన్న వరుసలు నిండిపోయి నారాయణగిరి ఉద్యానవనంలో కొందరు శ్రీవారి దర్శనానికి వేచి ఉన్నారు. వీరికి వైకుంఠ ద్వార దర్శనం లభించే అవకాశాలు లేవు. యాత్రికుల రద్దీ ఆదివారమూ కొనసాగే అవకాశాలున్నాయి. తితిదే సిఫార్స్‌ లేఖలను స్వీకరించడం లేదు. సోమవారం వరకు ఆర్జితసేవల రద్దును కొనసాగించనుంది. మంగళవారం నుంచి ఆర్జిత సేవలతో పాటు వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిబిడ్డల ప్రత్యేక దర్శనాలను పునరుద్ధరించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *