News

Scientific brahmotsavam

శాస్త్రీయ బ్ర‌హ్మోత్స‌వం

శాస్త్రీయ బ్ర‌హ్మోత్స‌వం

సైన్స్‌ పండుగకు తిరుపతి ఆతిథ్యం

అయిదు రోజుల వేడుకకు అతిరథులు

ఈనాడు-తిరుపతి : సప్తగిరుల్లో కొలువైన శ్రీవారి పాదాలచెంత తిరుపతి వేదికగా ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయాల్లో అయిదు రోజులపాటు సాగే ఈ శాస్త్రీయ సమ్మేళనానికి సకల ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తిరుపతికి చేరుకొని సమావేశాలను ప్రారంభించనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారమే తిరుపతికి చేరుకున్నారు. ప్రధాని మోదీ.. మంగళవారం ఉదయం దిల్లీ నుంచి నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని ఆపై ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధాన వేదికైన శ్రీ తారకరామా మైదానానికి విచ్చేస్తారు. 

ముఖ్యమంత్రి ఇక్కడే
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుపతిలోనే సోమవారం రాత్రి బసచేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. బుధవారం ఉదయం శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయానికి చేరుకుని అక్కడ చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను ప్రారంభిస్తారు. ఆ తరవాత.. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి విచ్చేసి అక్కడ మహిళా సైన్స్‌ కాంగ్రెస్‌ను ప్రారంభిస్తారు. ఈ సదస్సులో దేశవిదేశాలకు చెందిన నోబెల్‌ బహుమతి గ్రహీతలు ఆరుగురు పాల్గొని తమ అనుభవాలు పంచుకోనున్నారు. తరలివస్తున్న శాస్త్రకోవిదులకు ఆతిథ్యం కోసం ఇప్పటికే తిరుపతిలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రత్యేక ఫుడ్‌కోర్టులు, ప్రదర్శనశాలలు, ఇతరత్రా వేదికలు సన్నద్ధమయ్యాయి. అడుగడుగునా పటిష్టమైన నిఘా, బందోబస్తు నడుమ తిరుపతి ప్రత్యేక భద్రతా బలగాల గుప్పిట్లోకి వెళ్లిపోయింది.

సాంకేతిక అందలం
తొలిసారిగా మహిళా సైన్స్‌ కాంగ్రెస్‌
 

 

 

 

.

ఆతిథ్యం.. అదరహో!
బృహత్‌ శాస్త్రీయ సమ్మేళనానికి విచ్చేస్తున్న శాస్త్రవేత్తలు, పరిశోధకలకు అద్భుత ఆతిథ్యం అందిస్తోంది తిరుపతి నగరం. ఆహ్వాన, రవాణా, బస కమిటీల ఆధ్వర్యంలో తిరుపతి, చెన్నై, బెంగళూరు విమానాశ్రయాల్లో, రైల్వే స్టేషన్‌లలో, తిరుపతి ప్రయాణ ప్రాంగణంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి తిరుపతిలోని హోటళ్లకు, ప్రధాన వేదికకు తరలించేందుకు ప్రత్యేకంగా ఆధునిక సౌకర్యాలున్న ‘అమరావతి ఏసీ’ బస్సులు, 400 కార్లు సిద్ధంగా ఉంచారు. 

 

ప్రధాని వెంట తెలుగు తేజాలు 
ముగ్గురు తెలుగు ఆచార్యులు వివిధ హోదాల్లో ఇస్కా సదస్సులో ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పాల్గొననున్నారు. ఆతిథ్య వర్సిటీ తరఫున ఎస్వీయూ ఉపకులపతి ఆచార్య దామోదరం ప్రధానితో కలిసి వేదికను పంచుకోనున్నారు. సదస్సు ప్రారంభోత్సవానికి ఇస్కా గత కార్యవర్గ సభ్యులు, మండలి సభ్యులతో ప్రధాని ప్రత్యేకంగా ముచ్చటించనున్నారు. ఇందులో కార్యవర్గ సభ్యుడి హోదాలో ఇస్కా 95వ అధ్యక్షుడిగా పనిచేసిన ఎస్వీయూ మాజీ వీసీ ఆచార్య రాళ్లపల్లి రామమూర్తి, ఇస్కా ఎలెక్టెడ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ హోదాలో ఆచార్య భూపతి నాయుడుతో ప్రధాని చర్చించనున్నారు.