News

Technical wallpapers

సాంకేతిక సంక్రాంతి!

సాంకేతిక సంక్రాంతి!
పోటెత్తిన తిరునగరి
ఆత్మీయ సత్కారాల వేదిక
అబ్బురపరుస్తున్న ప్రదర్శనలు
శ్రీవారి సేవలో తరించిన మోదీ
ఎస్వీయూలో చంద్రన్న మమేకం
సైన్స్‌ కాంగ్రెస్‌కు శ్రీకారం
ఈనాడు-తిరుపతి

తిరుపతి వేదికగా సైన్స్‌ జాతరకు తెరలేచింది. అయిదు రోజుల పండుగకు ముస్తాబైన తిరునగరి ఆద్యంతం సాంకేతిక ప్రభను సంతరించుకుంది. తిరుక్షేత్రాన్ని అలంకరించిన తీరు.. పదిరోజుల ముందే సంక్రాంతి వచ్చిందా అన్నట్టుంది. ఎక్కడికక్కడ స్వాగత ద్వారాలు.. స్వచ్ఛభారత్‌ నినాదాల ఫ్లెక్సీలు..

అడుగడుగునా సైన్స్‌ కాంగ్రెస్‌ వైశిష్ట్యాన్ని తెలిపే భారీ కటౌట్లు.. వెరసి శాస్త్రీయ బ్రహ్మోత్సవాన్ని తలపిస్తోంది. దేశవిదేశాల నుంచి తరలివచ్చిన అతిరథ మహారథులు శ్రీవారి క్షేత్రంలో ఆత్మీయ సత్కారాల నడుమ మైమరచిపోయారు. తిరుధామం వేదికగా రెండోసారి నిర్వహిస్తోన్న 104వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను ప్రారంభించేందుకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరున్నర గంటలపాటు ఇక్కడ గడిపారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో దేశ ప్రగతిని సమీక్షిస్తూ.. మరోవైపు వేంకటేశ్వరుడి సేవలో తరిస్తూ ప్రశాంతంగా సాగిన ఆయన పర్యటన విజయవంతమైంది.

మోది.. ఆరు గంటల యాత్ర
ఇస్కా సమావేశాల ప్రారంభానికి దిల్లీ నుంచి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో మంగళవారం ఉదయం ఉదయం 11గంటలకు తిరుపతికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోది.. సాయంత్రం నాలుగు గంటల వరకు ఇక్కడే గడిపారు. విమానాశ్రయం నుంచి మూడు ప్రత్యేక హెలికాప్టర్‌లలో పశువైద్యవిశ్వవిద్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా తారకరామ మైదానానికి విచ్చేశారు.

విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, డీజీపీ సాంబశివరావు, కలెక్టర్‌ సిద్దార్థజైన్‌, అర్బన్‌ఎస్పీ జయలక్ష్మి, భాజపా ఎంపీ కంభంపాటి హరిబాబు, తిరుపతి శాసనసభ్యురాలు సుగుణమ్మ, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గీర్వాణి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్పగుచ్ఛాలను అందజేసి ఘన స్వాగతం పలికారు. తారకరామా మైదానంలో ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను లాంఛనంగా ప్రారంభించిన ఆయన..

నోబెల్‌ గ్రహీతలు సహా వివిధ విభాగాల్లో అవార్డులు సాధించిన వారిని సత్కరించారు. ఆపై అర్థగంటపాటు సాగిన ఆయన ప్రసంగం ఆద్యంతం భారతావనికి శాస్త్రవేత్తల కృషిని కొనియాడింది. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం సైతం ప్రముఖుల సేవలను ప్రస్తుతించింది. నోబెల్‌ బహుమతి గ్రహీతలతో పలు అంశాలపై ప్రధాని, ముఖ్యమంత్రి చర్చించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం తిరుమల శ్రీవారి దర్శనానికి ఆయన బయల్దేరి వెళ్లారు. అక్కడ శ్రీవారిని దర్శించుకుని ఆపై మధ్యాహ్నం విమానాశ్రయానికి చేరుకుని దిల్లీ బయల్దేరి వెళ్లారు. పండుగకు విచ్చేసిన ప్రతినిధులతో వేదిక కళకళలాడింది.అత్యంత కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో ప్రధాన వేదికకు వచ్చేవారి చరవాణిలు సైతం లోపలకు అనుమతించలేదు.

యంత్రాంగానికి అగ్నిపరీక్ష
మరోవైపున.. ఎస్వీయూ సహా తిరుపతిలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యుద్దీపాల వెలుగులో ఆయా విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు కళకళలాడుతున్నాయి. పలు కమిటీల సారథ్యంలో భోజనం.. పారిశుద్ధ్యం.. ఆతిథ్యం.. రవాణా.. భద్రత.. ఇలా అన్నిసేవలూ అగ్రభాగాన నిలిచాయి. ఎటుచూసినా తరలివచ్చిన ప్రతినిధులతో ఎస్వీయూ సహా తిరునగరిలో జనసందోహమే కన్పిస్తోంది. వూహించనిరీతిన జనసందోహం తరలిరావడంతో ఫుడ్‌కోర్టుల్లో నిర్దేశిత సమయానికే ఆహార పదార్థాలన్నీ నిండుకున్నాయి. సాధ్యమైనంత వరకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసినా చాలీచాలని పదార్థాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.